ఉద్యోగాలు & పరీక్షలుసెలవులుENతెలుగువెతకండి
10, నవంబర్ 2026, మంగళవారంతెలంగాణ ఎడిషన్
Citizen Square, front page

మధ్య జపాన్‌లో 5.7 తీవ్రతతో భూకంపం; కనీసం 22 మందికి గాయాలు, సునామీ ముప్పు లేదు

ఆదివారం తెల్లవారుజామున షిజువోకాలో వచ్చిన భూకంప ప్రకంపనలు క్యోటో, నారా దాకా తెలిశాయి. బలమైన ప్రకంపనలు రావచ్చని జపాన్ హెచ్చరించింది.

జాతీయ డెస్క్ప్రచురణ 8, నవం 2026, 21:49 IST

మధ్య జపాన్‌లో ఆదివారం, నవంబర్ 8 తెల్లవారుజామున వచ్చిన బలమైన భూకంపంలో కనీసం 22 మంది గాయపడ్డారు, పలు దుకాణాల అద్దాలు పగిలిపోయాయి. అయితే సునామీ ముప్పు లేదు. జపాన్ వాతావరణ సంస్థ (జేఎంఏ) ప్రాథమిక తీవ్రతను 5.7గా పేర్కొనగా, అమెరికా భూగర్భ సర్వే సంస్థ (యూఎస్‌జీఎస్) 5.5గా లెక్కించింది.

స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 1.04 గంటలకు (భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 9.34 గంటలకు) భూకంపం వచ్చింది. దీని కేంద్రం షిజువోకా ప్రిఫెక్చర్‌లో భూమికి సుమారు 40 కిలోమీటర్ల లోతులో ఉంది. పొరుగున ఉన్న ఐచీ ప్రిఫెక్చర్‌లో ప్రకంపనలు అత్యంత బలంగా వచ్చాయి. హమామత్సు నగరం, పాత రాజధానులు క్యోటో, నారా, గిఫూ, యమనాషి ప్రిఫెక్చర్లలోనూ ప్రకంపనలు తెలిశాయి.

గాయపడినవారిలో ఎక్కువమంది కింద పడి, చాలామంది మెట్లపై జారి గాయపడ్డారని స్థానిక వార్తలు తెలిపాయి. రాబోయే కొద్ది రోజుల్లో బలమైన ప్రకంపనలు రావచ్చని జేఎంఏ హెచ్చరించింది. ప్రకంపనలతో వాలు ప్రాంతాలు బలహీనపడి ఉండొచ్చు కాబట్టి వర్షం పడితే కొండచరియలు విరిగిపడే, రాళ్లు జారిపడే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నంకాయ్ ట్రఫ్‌లో అసాధారణ మార్పేదీ కనిపించలేదని తెలిపింది.

నంకాయ్ ట్రఫ్ ఎందుకు కీలకం

ఇది జపాన్ పసిఫిక్ తీరానికి ఆవల షిజువోకా నుంచి క్యూషూ దీవి దాకా సముద్రగర్భంలో విస్తరించిన భ్రంశ రేఖ. రాబోయే కొన్ని దశాబ్దాల్లో ఇక్కడ 8 లేదా 9 తీవ్రతతో భారీ భూకంపం రావచ్చని, దానితో వచ్చే సునామీ తీరంలో పెద్ద భాగాన్ని ముంచెత్తవచ్చని ప్రభుత్వ నిపుణులు భావిస్తున్నారు. 2024 ఆగస్టులో క్యూషూ సమీపంలో 7.1 తీవ్రతతో భూకంపం వచ్చిన తర్వాత జేఎంఏ ఈ ప్రాంతానికి తొలిసారి ‘మెగాక్వేక్ అడ్వైజరీ’ జారీ చేసింది; పెద్ద భూకంపం రాకపోవడంతో వారం తర్వాత దాన్ని ఉపసంహరించింది.

జపాన్ నాలుగు టెక్టానిక్ ఫలకాలు కలిసే చోట ఉంది. ప్రపంచంలోని అత్యంత బలమైన భూకంపాల్లో సుమారు ఐదో వంతు ఇక్కడే నమోదవుతాయి. కఠినమైన నిర్మాణ నిబంధనలు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థల వల్లే ఇలాంటి మోస్తరు భూకంపాల్లో ప్రాణనష్టం అరుదు.

మరిన్ని: ప్రపంచం

మరిన్ని →

తాజా వార్తలు

మరిన్ని →